రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల నేడు (ఆదివారం) వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు.